తరుముకొస్తున్న మరో ముప్పు.. ఇలా చేస్తే తప్పించుకోవచ్చు..!

by సూర్య | Fri, Oct 16, 2020, 04:16 PM

దేశంలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. కరోనా కట్టడియే లక్ష్యంగా వ్యాక్సిన్ కనుగొనే అంశంలో అటు వైద్య నిపుణులు..శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు అటు ప్రజలు సైతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఎలా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రజలకు డెంగీ వైరస్ సవాల్ విసురుతోంది. డెంగీ జ్వరం చాలా ప్రాణాంతకమైనది. డెంగ్యూ వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి.
ఏడిస్ దోమ కాటు ద్వారా డెంగ్యూ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డెంగ్యూ బారిన పడినవారికి తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. డెంగ్యూ బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ చెప్తోంది. 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటే మిగిలిన ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. అయితే తీవ్రమైన లక్షణాలు ఉండేవారిలో వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది.
డెంగ్యూ జ్వరాన్ని గుర్తించడం ఎలా..
డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారిని గుర్తించడం చాలా ఈజీ అని తెలుస్తోంది. ఈ వ్యాధి బారినపడిన వారు తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించలేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కంటి నొప్పి, ఎముక, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. వాంతులు రావడం, వికారంగా అనిపించడం, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చునని సీడీసీ తెలిపింది. తద్వారా డెంగీ మరణాల రేటు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
డెంగ్యూ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:
1. దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. అందువల్ల దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా దోమ తెరను ఉపయోగించాలి.
2. దోమలు మన దగ్గరికి రాకుండా మస్కిటో రెపెల్లెంట్లు వాడాల్సి ఉంటుంది. పడుకునేముందు దోమలు ఎక్కువగా కుట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో రెపెల్లెంట్లు వాడాలి. 3. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వాడాలి.
4. ఫుల్ హ్యాండ్ షర్టులు, పొడవైన ప్యాంటు ధరించడం మంచిది.
5. పరిసరాల పరిశుభ్రత- నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
6. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
7. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా రోజూ సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దోమలు సాయంత్రం వేళల్లోనే చురుగ్గా ఉంటాయి. ఆ సమయం నుంచే అవి ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
8. ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు, ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరచుకోవాలి. అలాంటి వాటి కారణంగానే దోమలు సంతతిని పెంచుకుంటాయి.
9. కూలర్లు, చెత్త డబ్బాలను శుభ్రం చేయాలి. ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది.
10. ఇతర చిట్కాలు- దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించాలి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడోచ్చు.

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ Thu, Apr 18, 2024, 10:35 AM
నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది Thu, Apr 18, 2024, 10:27 AM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 10:24 AM
పది మంది జూదరులు అరెస్టు Thu, Apr 18, 2024, 10:10 AM
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM