టెస్ట్ సిరీస్‌లో ఓపెనింగ్ చేసేదెవరో?

by సూర్య | Wed, Feb 12, 2020, 07:04 PM

టీమిండియా రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ఈ న్యూజిలాండ్ టూర్‌కు దూరమవ్వగా.. టీ20 సిరీస్ సందర్భంగా మరో ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో భారత్‌కు రెక్కలు విరిగినట్లైంది. టీ20 సిరీస్‌లో ధావన్ స్థానంలో రాహుల్ ఓపెనింగ్ చేసి ఇరగదీయగా.. వన్డే సిరీస్‌లో మాత్రం టీమ్‌మేనేజ్‌మెంట్ పృథ్వీ షా-మయాంక్‌లకు అవకాశం ఇచ్చింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన ఈ నయా ఓపెనింగ్ జోడి.. మిగతా రెండు వన్డేల్లో మాత్రం దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా మయాంక్ తేలిపోయాడు. ఈ నేపథ్యంలోనే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ఓపెనర్లు ఎవరా? అనే చర్చ ఊపందుకుంది. మాజీ క్రికెటర్ల మధ్య ఈ డిబేట్ జోరుగా సాగుతోంది. టెస్ట్ జట్టులో శుభమన్ గిల్, మయాంక్, పృథ్వీషా ముగ్గురు ఓపెనర్లు ఉండటంతో ఇన్నింగ్స్ ఏ జోడీ ప్రారంభిస్తుందనేదానిపై విశ్లేషణలు జోరుఅందుకున్నాయి. అయితే వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌తో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటూ అవకాశాలు అందుకోని శుభ్‌మన్‌గిల్‌కు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి. మరోవైపు మయాంక్‌ను ప్రధాన ఓపెనర్‌గా కొనసాగించాలి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మన్‌గా అతనేంటో నిరూపించుకున్నాడు. అతను గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. మూడు వన్డేలు, ఒక ప్రాక్టీస్‌లో విఫలమయ్యాడని అతన్ని పక్కన‌పెట్టకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు. అతను ఆడిన సమయంలో చాలా పరుగులు చేశాడు. కాబట్టి తొలి టెస్ట్‌లో మయాంక్, శుభ్‌మన్ ఓపెనింగ్ చేయాలనుకుంటున్నా.'అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్త మాత్రం హర్భజన్ అభిప్రాయాన్ని విభేదించాడు. ఓపెనర్‌గా పృథ్వీషానే బరిలోకి దిగాలన్నాడు. ‘శుభ్‌మన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని అర్థమవుతుంది. కానీ మనమంతా గుర్తుతెచ్చుకోవాల్సింది ఏంటంటే.. మయాంక్ కన్నా ముందు పృథ్వీషానే టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు. అద్భుతంగా రాణించాడు. గాయపడేంతవరకు అతనే ఫస్ట్ చాయిస్‌గా ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా అతను మంచి టచ్‌లో ఉన్నాడు. గాయంతో దూరమైన పృథ్వీకి మళ్లీ అవకాశం ఇవ్వాలి. శుభ్‌మన్ కొంతకాలం వేచి ఉండాలి'అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. ఇక శుభ్‌మన్‌ను మిడిలార్డర్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారీ స్థానంలో రిప్లేస్ చేయవచ్చా అన్న ప్రశ్నకు దాస్ గుప్తా, భజ్జీ వ్యతిరేకంగానే స్పందించారు.‘మిడిలార్డర్‌లో విహారి అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి లభించిన స్వల్ప అవకాశాలను ఎలాంటి తప్పు చేయకుండా సద్వినియోగం చేసుకున్నాడు. మిడిల్ కన్నా ఓపెనింగ్‌లో శుభ్‌మన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.'అని హర్బజన్ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన గత సిరీస్‌లో విహారీ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడని, శుభ్‌మన్ ఒక్క డబుల్ సెంచరీతో అతన్ని పక్కన పెట్టమనడం సరైంది కాదని దాస్‌గుప్తా చెప్పుకొచ్చాడు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM