అమరావతి నిర్మాణంలో సింగపూర్ కథ సమాప్తం!

by సూర్య | Sat, Jun 22, 2019, 09:28 PM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియం పాత్ర ముగిసినట్లే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకొని రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం.. భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. అమరావతి నిర్మాణంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంలోనూ రాజధాని నిర్మాణం ప్రస్తావన లేదు. రాజధాని నిర్మాణాలపై సీఎం జగన్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సింగపూర్ కన్సార్టియం ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధాని నిర్మించాలని పలు మార్లు ఆ దేశాన్ని సందర్శించారు. సింగపూర్ ప్రభుత్వరంగ సంస్థలైన అసెండాస్, సెంబ్ కాఫ్, సింగ్ బ్రిడ్జి కంపెనీలు సింగపూర్ కన్సార్టియం పేరుతో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయుని పాలెం, తాళ్లాయపాలెం సమీపంలోని 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయాల్సి వుంది. ఇందులో మౌళిక వసతులన్నింటిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. సింగపూర్ కన్సార్టియం విదేశాల నుండి పెట్టుబడులు తెప్పించి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుంది. ఇందులో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్,  విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత సింగపూర్ కన్సార్టియందే.
స్టార్టప్ ఏరియా ద్వారా వచ్చే లాభాల్లో 52 రెండు శాతం సింగపూర్ కన్సార్టియంకు, 48 శాతం ఏపీ ప్రభుత్వానికి వచ్చే విధంగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నాటి చంద్రబాబు సర్కార్ అగ్రిమెంట్ చేసుకుంది. ఫలితంగా సింగపూర్ ప్రభుత్వం రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ఉచితంగా నమూనాను తయారు చేయించి ఇచ్చింది. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీగా ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం కలసి ఈ ఒడంబడిక చేశాయి. సింగపూర్ కన్సార్టియంకు సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపు నుంచి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మెన్ గా వుండగా.. నారాయణ, సీఆర్డీఏ సెక్రటరీ అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సభ్యులుగా ఒప్పందం చేసుకున్నారు.
చంద్రబాబు అంచనాలు తారుమారై... పదవి కోల్పోవడంతో.. సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం 1,691 ఎకరాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఏడాదిన్నర సంవత్సరం అవుతోంది. ఇంతవరకు ఒక్క నిర్మాణం జరగలేదు. పనులు ప్రారంభించని కాంట్రాక్టులు రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు ఒక్క నిర్మాణం కూడా జరగని ఈ కార్యక్రమం కూడా త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది. జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం ఏ నమూనాతో పూర్తి చేస్తుందో ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబుకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం నిర్మాణం చేసేందుకు జగన్ సిద్దంగా లేరు. దీంతో సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందం కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సింగపూర్ కౌన్సిల్ జనరల్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ల సమావేశం కూడా జరుగలేదు. ఇది కూడా రాజధాని భవిష్యత్‌పై సంశయాలకు తావిస్తోంది.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM