జూలై లో సనాతన ధర్మంపై ఎన్‌ఆర్‌ఐ చిన్నారులకు శిక్షణ : జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

by సూర్య | Fri, Jun 21, 2019, 04:30 PM

ధర్మప్రచారంలో భాగంగా జూలై చివరి వారం నుండి అమెరికాలోని న్యూయార్క్‌, డల్లాస్‌, కేవ్‌లాండ్‌, పిట్స్‌బర్గ్‌ ప్రాంతాలతోపాటు బహ్రెయిన్‌, మస్కట్‌ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు సనాతన ధర్మం, శ్రీవేంకటేశ్వని మహిమలు, భక్తిభావం, సంప్రదాయాలు, పండుగలు తదితర ధార్మిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం భక్తులతో భవదీయుడు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం జరిగింది.


 ఈ సందర్భంగా పుట్టపర్తికి చెందిన సురేష్‌ కుమార్‌ అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సనాతన ధర్మంపై ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు వివిధ ప్రాంతాలలో నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన నాగభూషణం అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ విజయవాడలో టిటిడి ఆధ్వర్యంలో వైద్యశాల నిర్మాణం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మదనపల్లికి చెందిన కేశవ అనే భక్తుడు  అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కోసువారిపల్లిలో టిటిడి కల్యాణమండపం, టిటిడి ఆర్చ్‌లు నిర్మించే అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆలయాలలో భక్తులకు దర్శనం అయ్యాక ఉసిరి, బిల్వం, మారేడు, తులసి మొక్కలను ప్రసాదంగా ఇవ్వాలని విజయవాడకు చెందిన జగదీష్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మొక్కలను ప్రసాదంగా తీసుకోవడమే కాదు వాటిని నాటడం,  సంరక్షించడం ముఖ్యమన్నారు. 


విజయవాడకు చెందిన మూర్తి విష్ణునివాసంలోని షాపులలో ధరల పట్టిక ఉండడం లేదని అధిక ధరలకు విక్రయిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విచారించి లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. ఇటీవల టిటిడి  ఉద్యోగులకు వైద్య పరీక్షలు, పదోన్నతులు, హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు, హెల్త్‌ కార్డులు తదితర ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై టిటిడి ఉద్యోగులు కిరణ్‌, కల్పన, వెంకటరమణలు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతికి చెందిన వెంకటకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తిరుపతిలోని కోమలమ్మ సత్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతికి చెందిన ఉమామహేశ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ  తిరుపతి నగరానికి ప్రవేశించే ప్రధాన మార్గాలలో బ్రాందిషాపులు, మాంసం దుకాణాలను తొలగించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


 తిరుపతి అలిపిరి టోల్‌ గేటు వద్ద భద్రతా సిబ్బందికి ఖాకీ దుస్తులు కాకుండా భక్తి భావంతో కూడిన డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని, శ్రీనివాసం వసతి సముదాయాల నుండి బయటకు వచ్చే సందర్భంలో ట్రాఫిక్‌ సమస్యతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, తిరుచానూరులో కుంకుమార్చన సేవను మధ్యాహ్నం నిర్వహిస్తుండడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండడం లేదని తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ విషయాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని  జెఈవో సమాధానమిచ్చారు.


 ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ, శ్రీ ఇసి.శ్రీధర్‌, శ్రీరామ్మూర్తిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM