మీ మూత్రం రంగు మీ వ్యాధిని నిర్ధారిస్తుంది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 PM

మన మూత్రమే మన శరీరంలోని వ్యాధుల సంకేతాలను పంపుతుంది. మన శరీరంలోని వ్యర్థాలు రక్తంలోకి చేరతాయి. రక్తాన్ని వడగట్టే మూత్రపిండాలు, అందులో వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. అలాగే, అవసరానికి మించి శరీరంలో ఉన్న నీరు కూడా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంటుంది. అలాంటి ముఖ్యమైన మూత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలను తెలియజేస్తుంది. అందుకే వైద్యులు వ్యాధి నిర్ధారణలో భాగంగా మూత్ర పరీక్షను కూడా సూచిస్తుంటారు. మూత్రం రంగును పరిశీలించడం ద్వారా కొన్ని రకాల సమస్యలను గుర్తించొచ్చు. చిక్కటి పసుపు రంగు (డార్క్ ఎల్లో), పింక్, బ్రౌన్, పర్పుల్ మూత్రం ఇలా ఎన్నో రంగుల్లో మూత్రం వస్తుంటుంది. మనం తీసుకునే ఆహారం, ఔషధాలు, అనారోగ్యాలు ఇవన్నీ మూత్రం రంగును మార్చేస్తాయి.


లేత పసుపు రంగు


మన శరీరం ఉత్పత్తి చేసే యూరోబిలిన్ పిగ్మెంట్ వల్ల సాధారణంగా మన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణమైన రంగు. ఎలాంటి అనారోగ్యం లేనప్పుడు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇదే మాదిరి యూరిన్ వస్తుంటుంది. మనం తీసుకునే నీటి పరిమాణం కూడా మూత్రం రంగును నిర్ణయిస్తుంటుంది. 


రంగు లేకపోవడం


శరీరానికి కావాల్సిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని తీసుకుంటే అదనంగా ఉన్న మొత్తాన్ని మూత్రపిండాలు వెంటనే బయటకు పంపిస్తాయి. దాంతో పిగ్మెంట్లు సరిపడా చేరవు. దాంతో మూత్రం లేత పసుపు రంగులో మాదిరి కాకుండా రంగు లేకుండా, నీరు మాదిరే ఉంటుంది. 


ముదురు పసుపు రంగు


శరీరం డీహైడ్రేషన్ స్థితిలోకి వెళ్లినప్పుడు, అంటే కావాల్సినంత నీరు అందనప్పుడు.. మూత్రపిండాలు మూత్రం నుంచి అదనపు నీటిని తీసుకుంటాయి. దీంతో పిగ్మెంట్ల సాంద్రత పెరిగి చిక్కటి పసుపు రంగులో మూత్రం వస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు కూడా ముదురు పసుపు రంగులోకి మూత్రం మారిపోతుంది. బీ కాంప్లెక్స్, విటమిన్ మాత్రలు, సల్ఫాశాలజైన్, ఫెనజోప్రైడిన్ ఇలాంటి ఔషధాలు తీసుకుంటున్న వారిలోనూ మూత్రం ముదురు పసుపు లేదా ఆరెంజ్ రంగులోకి మారుతుంది. 


ఎర్రటి రంగు


కొన్ని సందర్భాల్లో మూత్రం ఎర్రటి రంగులో రావచ్చు. అంటే అంతర్గతంగా రక్తస్రావం అయినట్టు గుర్తు. మూత్రాశయం మార్గంలో రక్తస్రావం అయినప్పుడు ఇలా కనిపిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు, కేన్సర్, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. మూత్ర పిండాలు వడకట్టే సామర్థ్యం తగ్గినప్పుడు లేదా గ్లోమెరులోనెఫ్రైటిస్ సమస్యలోనూ ఇదే మాదిరి మూత్రం వస్తుంది.


ముదురు బ్రౌన్ రంగు


డార్క్ బ్రౌన్ రంగులో మూత్రం వస్తే అది బ్లాడర్ లేదా కిడ్నీ కేన్సర్ కు చిహ్నం. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా ఈ రంగుకు కారణమవుతాయి. డీహైడ్రేషన్ లోనూ ఇలా జరగొచ్చు. కనుక ఎర్రటి, డార్క్ బ్రౌన్, డార్క్ ఎల్లో రంగుల్లో మూత్రం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి వైద్యులను సంప్రదించడం అవసరం.


Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM