తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త

by సూర్య | Thu, Apr 25, 2024, 07:57 PM

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. కొండపై భక్తుల రద్దీ తగ్గిపోయింది. ప్రస్తుతం దర్శనం కోసం భక్తుల్ని నేరుగా క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే దర్శనం కూడా త్వరగానే పూర్తవుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 60,371 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీకి రూ.3.09 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే 20,301 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


 వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు


తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నులపండుగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.


మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో ఏవి ధర్మా రెడ్డి దంపతులు, జేఈవో గౌతమి, సీపీఆర్వో డా.టి.రవి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం


చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకున్నారు. అనంతరం అక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.


సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. రాత్రి 8 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.

Latest News

 
నేటి పంచాంగం 08-05-2024 Wed, May 08, 2024, 10:43 AM
జగన్ను గెలిపించండి: లక్ష్మీ భార్గవి Wed, May 08, 2024, 10:39 AM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 10:39 AM
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM